KCR: 'హెలికాప్టర్ మనీ' గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్!
- విపత్కర పరిస్థితుల్లో ఆర్బీఐ ఆదుకోవాలని కేసీఆర్ సూచన
- ఇతర దేశాల్లో 'క్యూఈ' అమలుచేస్తున్నారని వెల్లడి
- నగదును సమాజంలోకి పంప్ చేయడమే 'హెలికాప్టర్ మనీ' అంటూ వివరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ, 'హెలికాప్టర్ మనీ' గురించి ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థికరంగంలో 'క్యూఈ' (క్వాంటిటేటివ్ ఈజింగ్) అనేది ఎంతో ఉపయుక్తమైన ప్రక్రియ అని తెలిపారు. యూకేకి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉందని, జపాన్ కు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉందని, చైనాకి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉందని, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో ప్రతి దేశానికి ఓ గవర్నింగ్ బ్యాంకు ఉంటుందని వివరించారు. దేశం ఏదైనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఈ గవర్నింగ్ బ్యాంకులు ముందుకొచ్చి 'క్యూఈ' విధానాన్ని అమలు చేస్తారని చెప్పారు.
"ఆ దేశానికి ఎంత జీడీపీ ఉందో అందులో కొంత శాతాన్ని ఆ గవర్నింగ్ బ్యాంకు ప్రభుత్వాల ద్వారా మార్కెట్లలో రిలీజ్ చేస్తుంది. తద్వారా విపత్కర పరిస్థితుల నుంచి దేశాలను కాపాడుకోవడంలో ఈ 'క్యూఈ' విధానం ఎంతో ఉపకరిస్తుంది. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు 10 శాతం క్యూఈ ప్రకటించింది. ఆ మేరకు ట్రంప్ 2 ట్రిలియన్ డాలర్లను అమెరికా సమాజంలో ప్రవేశపెట్టారు. యూకేలోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలి.
రాష్ట్రాల ఆర్థికపరిస్థితి, దేశ ఆర్థికపరిస్థితి ఏం బాగాలేదు. ఇక్కడ కూడా రిజర్వ్ బ్యాంకు క్యూఈ నిర్ణయం తీసుకోవాలి. మన దేశ జీడీపీ 203 లక్షల కోట్ల రూపాయలు కాగా, దాంట్లో కనీసం ఐదు శాతం అంటే రూ. 10 లక్షల కోట్లను వివిధ రూపాల్లో సమాజంలో ప్రవేశపెట్టాలి. చిన్నతరహా వ్యాపారులు, దుకాణదారులు, పాలవ్యాపారులు, కార్మికులు, రేషన్ కార్డులు లేనివారు, రైతులు ఎంతోకొంత సాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటివారి కోసం సమాజంలోకి నగదు పంప్ చేస్తే అది ఎంతో ఊరట కలిగిస్తుంది. ఈ విధంగా పంపిణీ చేసే డబ్బును అంతర్జాతీయంగా హెలికాప్టర్ మనీ అంటారు. హెలికాప్టర్ నుంచి డబ్బును కిందికి వెదజల్లితే ఎలా ఉంటుందో 'క్యూఈ' విధానం కూడా అలాంటిదే" అని వివరించారు.
ఈ నెలాఖరు వరకు రైళ్లు, విమానాలు తిరగవని, లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని రేపు గానీ, ఎల్లుండి గానీ అధికారికంగా ప్రకటిస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా మేలని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశం అమెరికా సైతం కరోనాతో సతమతమవుతోందని, అమెరికాతో పోల్చితే మనం మెరుగైన స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇదంతా ప్రజల సహకారం వల్లే సాధ్యమైందని, వారు మరికొన్నిరోజులు ఇలాగే స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.