New York: న్యూయార్క్ లో పాఠశాలలకు ఆగస్టు వరకూ సెలవులు!
- సెప్టెంబర్ లోనే తిరిగి ఓపెన్
- విద్యా సంవత్సరం ముగిసేంత వరకూ తెరిచే అవకాశం లేదు
- న్యూయార్క్ మేయర్ బిల్ డీ బ్లాసియో
అమెరికాలో అతిపెద్ద మహా నగరంగా ఉన్న న్యూయార్క్ లో విద్యార్థులకు ఆగస్టు వరకూ సెలవులుంటాయని, సెప్టెంబర్ లో మాత్రమే పబ్లిక్ స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు ఉన్నాయని నగర మేయర్ బిల్ డీ బ్లాసియో వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గని కారణంతోనే, విద్యా సంవత్సరం ముగిసేంత వరకూ స్కూళ్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తామేమీ అంత సులభంగా తీసుకోలేదని, పరిస్థితులను సమీక్షించి, మెట్రోపాలిటన్ రీజియన్ లోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతనే విద్యార్థులు, ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని మీడియాకు ఆయన వెల్లడించారు.
ఇదిలావుండగా, మేయర్ కు పాఠశాలలను మూసివేసే అధికారాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. మేయర్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి వుందని వెల్లడించారు. మేయర్ నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చే అధికారాన్ని కూడా కలిగివుంటారని న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్ ప్రొఫెసర్ రోడ్రిక్ హిల్స్ వ్యాఖ్యానించారు.
కాగా, మేయర్ పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, తొలుత జూన్ వరకూ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థించానని వ్యాఖ్యానించిన గవర్నర్, ఇతర ప్రాంతాల్లోని అధికారులతోనూ మాట్లాడిన తరువాతే, పాఠశాలల మూసివేత పొడిగింపుపై నిర్ణయిస్తామని అన్నారు. ఇక మేయర్, గవర్నర్ లు గతంలో ఈ విషయమై విభేదించినప్పటికీ, ప్రస్తుతం సరైన నిర్ణయమే తీసుకున్నారని, స్కూళ్లు మూసే ఉంటాయని డీ బ్లాసియో అధికార ప్రతినిధి ఫ్రెడ్డీ గోల్డ్ స్టెయిన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ న్యూయార్క్ లో కరోనా కారణంగా 5,820 మంది మరణించారు.