Karnataka: కరెన్సీ నోట్లను ఉమ్మేసి వెదజల్లారన్న అనుమానంతో... డబ్బు తగులబెట్టిన ప్రజలు!
- కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో ఘటన
- కావాలనే పారేసి వెళ్లారన్న మహిళలు
- గ్రామస్థులంతా చేరి నోట్లను కాల్చేసిన వైనం
నడిరోడ్డు మీద నడిచి వెళుతుంటే, రోడ్డుపై డబ్బులు కనిపిస్తే, ఏం చేస్తాం. తీసి కళ్లకద్దుకుని జేబులో పెట్టుకుంటాం. లేదంటే, ఆ డబ్బు ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతేకానీ, డబ్బును చేతిలోకి తీసుకోకుండా మాత్రం అడుగు వేయం. కానీ, కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ, కావాలనే కొందరు వైరస్ ను వ్యాపిస్తున్నారన్న వదంతులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, కర్ణాటకలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎవరో నోట్లపై ఉమ్మేసి, కరోనాను వ్యాపింపజేసేందుకు రోడ్డుపై డబ్బును విసిరేసి వెళ్లారన్న అనుమానంతో, ఆ డబ్బును ముట్టుకోకుండా, ప్రజలు కాల్చి బూడిద చేశారు.
ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో జరిగింది. ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన ముగ్గురు అపరిచితులు, తొలుత తమ ఫోన్ లో మాట్లాడారని, ఆపై డబ్బులు పారేసి వెళ్లినట్టు తాము చూశామని కొందరు స్థానిక మహిళలు వెల్లడించారు. ఆ వెంటనే దాన్ని ఎవరూ ముట్టుకోకుండా మట్టిని చల్లించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా కలిసి, నోట్లను కాల్చి బూడిద చేయాలని నిర్ణయించి , వాటిని తగులబెట్టారు.