Corona Virus: ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు వెళ్తూ.. తొలిసారి కరోనాపై మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
- మూడు రోజులు ఐసీయూలోనే జాన్సన్
- వైద్య సిబ్బందికి వట్టి థ్యాంక్స్ చెప్పలేనన్న ప్రధాని
- వారికి జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్య
కరోనా విజృంభణ నేపథ్యంలో బ్రిటన్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. యూకేలో ఇప్పటివరకు 78 వేలకు పైగా కరోనా కేసులు 9 వేలకు పైగా మరణాలు సంభవించాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స తీసుకోవడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆయనను తాజాగా వైద్యులు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. దాదాపు మూడు రోజుల పాటు ఆయన ఐసీయూలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన మొదటి సారిగా మాట్లాడారు. కరోనా సోకిన తనకు ఆసుపత్రిలో చికిత్స చేసి, రక్షించిన వైద్య సిబ్బందికి తాను తన జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రి సిబ్బందికి వట్టి థ్యాంక్యూ చెప్పి రుణం తీర్చుకోలేనని అన్నారు.
బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి గురించి యూకే హోం సెక్రటరీ ప్రీతి పాటిల్ మాట్లాడుతూ... 'బోరిస్ జాన్సన్‌కు విశ్రాంతి తీసుకునేందుకు కాస్త సమయం కావాలి. ఆయన పూర్తిగా కోలుకోవాల్సి ఉంది' అని తెలిపారు. ఆయన తిరిగి ప్రధానిగా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఇప్పట్లో కార్యాలయం నుంచి పనిచేస్తారని తాము అనుకోవట్లేదని ఎన్10లోని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.
కొన్ని వారాలు ఆయన విశ్రాంతి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ఫారెన్ సెక్రటరీ డోమినిక్ నేతృత్వంలో దేశంలో మంత్రులు లాక్‌డౌన్ పరిస్థితులను సమీక్షిస్తారని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి నాటికి యూకేలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 917 మరణాలు సంభవించాయి. బ్రిటన్‌లో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.