MS Dhoni: ఈ పదేళ్లలో ధోనీ కీపింగ్ ప్రాక్టీసు చేయడాన్ని మొదటిసారి చూశాను: సూపర్ కింగ్స్ ఫిజియో
- ఇటీవల సూపర్ కింగ్స్ ట్రైనింగ్ సెషన్ లో ధోనీ సాధన
- ధోనీ కఠోరంగా శ్రమించాడన్న ఫిజియో టామీ సిమ్సెక్
- ధోనీలో పట్టుదల కనిపిస్తోందని వెల్లడి
టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఐపీఎల్ తాజా సీజన్ తో ముడిపడి ఉందని కోచ్ రవిశాస్త్రి ఎప్పుడో చెప్పారు. క్రికెట్ పండితులందరి అభిప్రాయం కూడా ఇంచుమించు ఇదే! ఐపీఎల్ లో రాణించడంపైనే ధోనీకి టీమిండియాలో బెర్తు దక్కే అవకాశాలుంటాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగనుండగా, ఆ టోర్నీలో ఆడే టీమిండియాలో ధోనీ కూడా ఉండాలని కోరుకునేవాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. అయితే 2019 వరల్డ్ కప్ తర్వాత ధోనీ క్రికెట్ బరిలో దిగింది లేదు.
ఈ నేపథ్యంలో, ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫిజియో టామీ సిమ్సెక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఇటీవల లాక్ డౌన్ కు ముందు నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్ లో ధోనీ ఎంతో తీవ్రంగా సాధన చేశాడని, ఈ పదేళ్లలో ధోనీ కీపింగ్ ప్రాక్టీసు చేయడాన్ని మొట్టమొదటిసారి చూశానని తెలిపాడు. ఐపీఎల్ లో రాణించాలన్న పట్టుదల ధోనీలో కనిపించిందని, తద్వారా టి20 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో స్థానం కోసం ధోనీ ఎంత శ్రమిస్తున్నాడో అర్థమవుతోందని సిమ్సెక్ వివరించాడు.