Devineni Uma: ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదు: దేవినేని ఉమ
- రమేశ్ కుమార్ ను ఇష్టానుసారం తొలగించారంటూ వ్యాఖ్యలు
- రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చారంటూ విమర్శలు
- కోర్టు మొట్టికాయలు తప్పవన్న దేవినేని ఉమ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఇష్టానుసారం తప్పించారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చిందని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని, ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు జీవోలకు గవర్నర్ కార్యాలయం వంతపాడరాదని పేర్కొన్నారు.
ఎగుమతులు లేక మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని, మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పే ధైర్యం సీఎంకు లేదని విమర్శించారు. లాక్ డౌన్ ఎత్తివేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని మండిపడ్డారు. పరిపాలన చేతకావడంలేదని జగన్ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. బాధ్యతగల నేతగా చంద్రబాబు రాష్ట్రానికి అనేక సూచనలు చేస్తున్నారని, చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులను క్వారంటైన్ లో పెట్టారని, కానీ చెన్నై నుంచి వచ్చిన కనగరాజ్ ను ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో రోజూ తిరుగుతున్న విజయసాయిరెడ్డిని క్వారంటైన్ కు తరలించాలని పేర్కొన్నారు.