Migrants: తమ వెంట కరోనాను కూడా తీసుకెళతారు జాగ్రత్త: భారత్ ను హెచ్చరించిన వరల్డ్ బ్యాంకు

World Bank warns India migrants could easily carrying corona in reverse migration

  • లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు
  • స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వందలమైళ్ల ప్రయాణాలు
  • ఇది ప్రమాదకర పరిణామం అన్న వరల్డ్ బ్యాంకు
  • కరోనా లేని ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని వెల్లడి

భారత్ లో లాక్ డౌన్ విధించిన తర్వాత లక్షల మంది వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వాటిలో సఫలమైనవి కొన్నే. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు వలస కార్మికుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో కరోనా వైరస్ మరింతగా విస్తరించడానికి కారణమవుతారని హెచ్చరించింది.

ఇప్పటివరకు కరోనా లేని ప్రాంతాలు కూడా వలస కార్మికుల కారణంగా కరోనా కేసులను చూస్తాయని పేర్కొంది. మురికివాడల్లో నివాసం ఉండేవాళ్లు, వలస కార్మికుల కారణంగా కరోనా మరింత సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంకు తన తాజా నివేదికలో వెల్లడించింది.

"పట్టణ, నగర ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కార్మికులు అత్యంత ప్రయాసతో స్వంత ప్రాంతాలకు నడిచి వెళుతున్నారు. మున్ముందు భారత్ లో అనేక ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేశాం. భారీ సంఖ్యలోని వలస కార్మికులు ఈ మహమ్మారికి వాహకాలుగా పనిచేస్తారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు, గ్రామాలకు ఈ మహమ్మారి సులభంగా పాకిపోతుంది.

ప్రస్తుతం వలసదారుల తిరోగమనాన్ని నిరోధించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లడం ఏమంత మంచిది కాదన్న విషయాన్ని ప్రభుత్వాలు వలసకార్మికులకు నచ్చచెప్పాలి. ప్రమాదకర రీతిలో వందల మైళ్లు కాలినడకన వెళ్లడం ప్రాణాలకే ముప్పు అని వాళ్లను హెచ్చరించి, తద్వారా ఎక్కడివారికి అక్కడ ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలు కలుగజేయాలి" అని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో వివరించింది.

  • Loading...

More Telugu News