Corona Virus: ముందే హెచ్చరించినా పట్టించుకోని ట్రంప్.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

 Trump does not listen to officials warning beforehand New York Times over report

  • వైరస్‌ వ్యాప్తిపై అధికారుల సూచనలు పట్టించుకోని అధ్యక్షుడు
  • ముఖ్యమైన మూడు వారాలు దాటేశారని వెల్లడి
  • కరోనాతో అల్లాడుతోన్న అమెరికా 

కరోనా దెబ్బకు  అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన ఆ దేశంలో రోజూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మందికి వైరస్ సోకింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే అగ్రరాజ్యంలో అత్యధిక ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఫల్యం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం రేకెత్తిస్తోంది.

కరోనా వ్యాప్తి గురించి అమెరికా అధికారులు ముందుగానే హెచ్చరించినా ట్రంప్ పట్టించులేదని, కేవలం ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి సారించడం వల్లే దేశంలో పరిస్థితి చేయిదాటిపోయిందని ఆ పత్రిక పేర్కొంది. కరోనా ప్రారంభ దశలోనే ఇంటెలిజెన్స్‌, భద్రతా వర్గాలు, ఆరోగ్య శాఖ అధికారులు సైతం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ ట్రంప్ పెడచెవిన పెట్టారని న్యూయర్క్ టైమ్స్‌ చెప్పింది.


లక్షల మంది చనిపోతారన్న ట్రంప్ ముఖ్య వాణిజ్య సలహాదారు


చైనాలోని వుహాన్ నగరంలో కొత్త  వైరస్ వ్యాపిస్తుందనే సమాచారం జనవరి నెల మొదట్లోనే అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ వర్గాలకు తెలిసింది. కానీ, దీనిపై వెంటనే స్పందించకుండా.. కొన్ని వారాల తర్వాత జాతీయ భద్రతా కౌన్సిల్లోని బయో డిఫెన్స్ వర్గాలకు వైరస్ తీవ్రతను అంచన వేసే బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాతే కరోనా కట్టడిపై చర్యలు తీసుకున్నారని  సదరు వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

కానీ, అప్పటికే ముఖ్యమైన మూడు వారాల సమయాన్ని అమెరికా దాటేసిందని చెప్పింది. అదే టైమ్‌లో ట్రంప్.. చైనాతో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరపాల్సి ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. ఈ విషయంలో ట్రంప్ ముఖ్య వాణిజ్య సలహాదారు పీటర్ నువారో జనవరి చివరల్లో ఒక లేఖ రాశారని చెప్పింది. కరోనా కారణంగా అమెరికాలో లక్షల మంది  ప్రజలు ప్రాణాలు కోల్పోతారని, ట్రియలన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అమెరికా కోల్పోతుందని, దాదాపు 30 శాతం దేశ జనాభా ఈ వైరస్ బారిన పడుతుందని అందులో హెచ్చరించారని తెలిపింది.


రెండు వర్గాలుగా చీలిన వైట్‌హౌస్ 


 ఫిబ్రవరి మూడో వారంలో ప్రజారోగ్య ఆధికారులు సామాజిక దూరం, ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వంటి సూచనలు జారీ చేశారని చెప్పింది. అయితే, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు అధ్యక్షుడితో పంచుకునే అవకాశం వారికి రాలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ట్రంప్ తన ప్రజారోగ్య సలహాదారుడిని పక్కనపెట్టి, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు వైరస్ కట్టడి బాధత్యలు అప్పగించడం వివాదాస్పదమైందని అభిప్రాయపడింది. దాంతో వైరస్‌పై చర్యల విషయంలో వైట్‌హౌస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని విమర్శించింది. కానీ, వైరస్ తీవ్రత పెరగడంతో ట్రంప్ తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News