Amaravati: 'అమరావతి జిందాబాద్' అంటూ రైతుల నినాదాలు.. పోలీసుల నోటీసులు!
- ఈ నెల 11న నినాదాలు చేసిన వెంకటాయపాలెం రైతులు
- లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసుల నోటీసులు
- తమకు ప్రభుత్వం కౌలు చెల్లించలేదంటూ ఎస్పీకి రైతుల లేఖ
లాక్ డౌన్ నేపథ్యంలో అమరావతి రైతులు బహిరంగంగా తమ ఆందోళనలు ఆపివేసినా... ఇళ్లలో ఉండే నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, ఈనెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు వెంకటాయపాలెం గ్రామం యూనియన్ బ్యాంకు చుట్టుపక్కల ఇళ్లలోని వారు 'అమరావతి జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. దీనిపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
జిల్లాలో సెక్షన్ 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున.. సెక్షన్ 188, 269, 270, 271ల కింద రైతులకు నోటీసులు జారీ చేశారు. లాక్ డౌన్ సమయంలో బయట తిరగడం, కలవడం జరిగిందని నోటీసుల్లో పేర్కొన్నారు. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని అడిగారు.
ఈ నోటీసులపై జిల్లా ఎస్పీకి వెంకటాయపాలెం రైతులు లేఖ రాశారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన కౌలు ఇంకా చెల్లించలేదని... తాము ఎంతో క్షోభను అనుభవిస్తున్నామని లేఖలో తెలిపారు. తమ కుటుంబాలు దుర్భరమైన స్థితిని అనుభవిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాము నిరసనను తెలియజేస్తున్నామని... మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవరి ఇళ్లలో వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. మొన్నటి వరకు పోలీసుల నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని... ఎస్ఐ వచ్చి వివరంగా చెప్పినందున లాక్ డౌన్ అమల్లో ఉన్నంత వరకు నిరసనలు వాయిదా వేస్తున్నామని చెప్పారు. తమకు రావాల్సిన కౌలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.