koti: కరోనా నేపథ్యంలో.. సేవ్ ద వరల్డ్’ అంటూ కోటి నుంచి మరో పాట!
- కొడుకుతో కలిసి స్వరపరిచి, ఆలపించిన కోటి
- లిరిక్స్ అందించిన శ్రీనివాస మౌళి
- ప్రకృతిని కాపాడుకోవడంపై చైతన్య పరిచే ప్రయత్నం
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో దేశంలోని ప్రముఖులు కూడా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు వివిధ రూపాల్లో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో నటించారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ పాటను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారి కృషిని ప్రశంసించారు.
కోటి ఇప్పుడు మరో పాట కూడా రూపొందించారు. ‘సేవ్ ద వరల్డ్’ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట ద్వారా ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. శ్రీనివాస మౌళి ఈ పాటను రచించారు. కొడుకు రోషన్‌తో కలిసి స్వర పరిచిన కోటి.. ఈ పాటను ఆలపించారు. ప్లాస్టిక్ వాడకం, అడవులు నరకడం, కాలుష్యం వల్ల నష్టాలను వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశారు.