Hyderabad: నిందితుడి చేతిపై క్వారంటైన్ ముద్ర... జైలులోకి అనుమతించని సిబ్బంది
- యాభై కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- జైలుకు తీసుకువెళ్లగా పోలీసులకు ఎదురైన అనుభవం ఇది
కోర్టు రిమాండ్ విధించిన నిందితుడి చేతిపై క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్లు ముద్ర ఉండడంతో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ పోలీసులు లోపలికి అనుమతించని ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...దాదాపు యాబై కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్ కోర్టు ముందు హాజరుపరిచారు.
అంతకు ముందు నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా జ్వరం ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్వారంటైన్ చేయాలని వైద్య సిబ్బంది సూచించి అతని చేతిపై ముద్రవేశారు. అయితే కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు నేరుగా నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడి సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్‌లో నిందితుడికి జ్వరం ఉందని తేలడంతో వెనక్కు పంపించారు.