Roja: జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రజలు కొనియాడుతున్నారు: ఎమ్మెల్యే రోజా
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.3 కోట్ల మందికి మాస్కుల పంపిణీ
- ప్రజలకు మొత్తం కలిపి 16 కోట్ల మాస్కుల పంపిణీ
- ప్రతి ఒక్కరు మూడు మాస్కుల చొప్పున అందుకుంటారు
కరోనాను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆయన నిర్ణయాలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై నిన్న జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను రోజా ప్రస్తావించారు.
'రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కలిపి 16 కోట్ల మాస్కుల పంపిణీకి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మూడు మాస్కుల చొప్పున అందుకుంటారు' అని రోజా తెలిపారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొనియాడుతున్నారని ఆమె చెప్పారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
కాగా, కరోనా హైరిస్క్ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిన్న సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఇప్పటికే అధికారులకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధించింది. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.