China: చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఒక్క రోజులో 108 కేసులు నమోదు
- లాక్డౌన్ ఎత్తేసిన చైనా
- అటవీ జంతువుల మాంసంపై తాత్కాలికంగా నిషేధం
- విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా
- చైనాలో 3341కు పెరిగిన మృతుల సంఖ్య
కరోనా వైరస్ 'కొవిడ్-19' పుట్టిన చైనాలో పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయా? అన్నట్లు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావట్లేదని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన చైనా లాక్డౌన్ను కూడా ఎత్తేసిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఆ దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే చైనాలో 108 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కొన్ని వారాలుగా చైనాలో అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి.
మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చైనా పలు చర్యలు తీసుకుంటోంది. వుహాన్లో జంతు మాంసం తినడం వల్లే కరోనా వ్యాపించిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటవీ జంతువుల మాంసంపై చైనా తాత్కాలికంగా నిషేధం విధించింది.
ఈ క్రమంలో, చైనాలో కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చే వారి నుంచే నమోదవుతున్నాయని అధికారులు గుర్తిస్తున్నారు. చైనాలో కరోనా విజృంభణ తగ్గడంతో విదేశాల నుంచి చైనీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. చైనాలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3341కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 82160కి పెరిగింది.
ప్రస్తుతం చైనాలోని పలు ఆసుపత్రుల్లో 1156 మంది చికిత్స తీసుకుంటున్నారు. అలాగే, దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని వారాలుగా తమ దేశంలో నమోదైన కొత్త కేసుల్లో సగం అమెరికా నుంచి వచ్చిన వారి వల్లే నమోదయ్యాయని దక్షిణ కొరియా ప్రకటించింది.