Corona Virus: తెలంగాణలో కలకలం.. నిజాముద్దీన్ తరహా మరో ఘటన వెలుగులోకి!
- యూపీలోని మదర్సా సమ్మేళనానికి వెళ్లిన పలువురు
- ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు నమోదు
- మిగిలిన వారిని గాలిస్తున్న పోలీసులు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టుండి రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ ఘటనను మరువక ముందే తెలంగాణను మరో ఘటన కుదిపేస్తోంది. నిజాముద్దీన్ తరహాలోనే మరో ఉదంతం వెలుగు చూడటంతో అధికారులు హడలిపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ లో ఇటీవల జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, పోలీసు శాఖ అప్రమత్తమైంది. అక్కడకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు, వారిని గాలించే పనిలో పడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు 100 మంది వరకు హాజరైనట్టు భావిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కొందరిని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.