ipl: ఐపీఎల్ జరుగుతుందా? లేదా? తుది నిర్ణయం నేడే!
- ప్రకటన చేయనున్న బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ
- లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి ఉన్న బోర్డు
- రద్దు చేసే అవకాశాలే ఎక్కువ!
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్ జరుగుందా? ఈ నెల 15వ తేదీకి వాయిదా పడ్డ మెగా లీగ్ మరికొన్ని రోజులు వెనక్కి వెళ్లనుందా? లేదంటే ఈ సీజన్ మొత్తానికే రద్దవుతుందా? అనేది ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం లాక్డౌన్ పొడిగించే ఆలోచనలో ఉంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కనీసం రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌పై స్పష్టత వచ్చిన వెంటనే ఐపీఎల్‌పై గురించి ప్రకటన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. లీగ్‌పై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
‘బీసీసీఐ ఆఫీస్ బేరర్లతో మాట్లాడిన తర్వాత సోమవారం ఐపీఎల్‌పై స్పష్టత ఇస్తా. నిజాయతీగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా క్రీడలకు చోటెక్కడిది?’ అని గంగూలీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేసే అవకాశాలే ఎక్కువ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.