Gautam Gambhir: ఐపీఎల్ రద్దయితే ధోనీ పునరాగమనం కష్టమే: గంభీర్
- ఐపీఎల్ పై కరోనా ప్రభావం
- మరికొన్ని గంటల్లో తేలనున్న ఐపీఎల్ తాజా సీజన్ భవితవ్యం
- ఏడాదిన్నరగా క్రికెట్ ఆడని ధోనీ
- ఐపీఎల్ లో సత్తా చాటితే టీమిండియాలో బెర్త్ దొరికే అవకాశం!
కరోనా వైరస్ ప్రభావం అనేక రంగాలపై పడింది. క్రీడారంగం కూడా ఈ వైరస్ కారణంగా ఎంతో నష్టపోయింది. ఒలింపిక్స్ వంటి అతిపెద్ద క్రీడా సంరంభమే వచ్చే ఏడాదికి వాయిదాపడింది. భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ పైనా కరోనా పంజా విసిరింది. ఈ క్రమంలో ఐపీఎల్ తాజా సీజన్ జరిగేది లేనిదీ మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఐపీఎల్ లో ఆడి తన సత్తా చాటాలని భావిస్తున్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఇప్పుడు డైలమాలో పడింది. దీనిపై మాజీ ఆటగాడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఐపీఎల్ జరగకపోతే టీమిండియాలోకి ధోనీ పునరాగమనం చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఒకటిన్నర సంవత్సర కాలంలో ధోనీ క్రికెట్ బరిలో దిగలేదని, అందువల్ల అతడి ఆటతీరును సెలెక్టర్లు అంచనా వేసేందుకు ఐపీఎల్ ఒక్కటే మిగిలిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ జరగకపోతే మాత్రం ధోనీ అవకాశాలు సన్నగిల్లినట్టేనని పేర్కొన్నాడు. అయితే ధోనీకి కేఎల్ రాహుల్ ను ప్రత్యామ్నాయంగా భావించవచ్చని, కేఎల్ రాహుల్ ధోనీ అంత చక్కగా కీపింగ్ చేయకపోయినా టి20 క్రికెట్ లో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నవాడని తెలిపాడు. ఎప్పుడు రిటైర్ అవ్వాలన్నది ధోనీ వ్యక్తిగత విషయం అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.