Chandrababu: ఏపీలో ఉద్దేశపూర్వకంగానే కరోనా ప్రభావాన్ని తక్కువచేసి చూపిస్తున్నారు: చంద్రబాబు
- జిల్లాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచన
- మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిక
- ప్రధానితో సమావేశంలో జగన్ కావాలనే తప్పులు చెప్పారని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదు నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణకు జిల్లాను ప్రాతిపదికగా తీసుకోవాలే తప్ప, మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుని వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపించడం తగదని అన్నారు. కరోనా ప్రభావాన్ని, మరణాలను తక్కువ చేసి చూపించడం వల్ల నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి రావడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.
అటు, సీఎం జగన్ కూడా ప్రధానితో సమావేశంలో కావాలనే కరోనా తీవ్రతను తగ్గించి చెప్పారని చంద్రబాబు ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఓ మతానికి చెందినవారిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.