Retail Inflation: మార్చి నెల చిల్లర ద్రవ్యోల్బణం 5.91 శాతం!
- మార్చి 19 వరకే గణాంకాల సేకరణ
- వాటితోనే ద్రవ్యోల్బణం లెక్కలు
- వెల్లడించిన గణాంకాల విభాగం
వినియోగ ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ - సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గడచిన మార్చిలో 5.91 శాతానికి చేరింది. అంతకుముందు ఫిబ్రవరిలో రిటైల్ ఇన్ ఫ్లేషన్ 6.58గా నమోదైంది. జాతీయ గణాంకాల విభాగం విడుదల చేసిన తాజా నివేదిక మేరకు ఫిబ్రవరిలో 10.81 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం, మార్చిలో 8.76 శాతానికి తగ్గింది.
"ఇండియాలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంలో భాగంగా, క్షేత్ర స్థాయిలో సీపీఐ గణాంకాల సేకరణ మార్చి 19 తరువాత నిలిచిపోయింది. ఈ కారణంతో 69 శాతం ప్రైస్ కొటేషన్లను మాత్రమే మా సిబ్బంది సేకరించారు. వాటి ఆధారంగానే ఈ గణాంకాలను రూపొందించాం" అని ఎన్ఎస్ఓ పేర్కొంది.
ఇక ఈ గణాంకాల ప్రకారం, కూరగాయల ద్రవ్యోల్బణం ఫిబ్రవరితో పోలిస్తే 31.61 శాతం నుంచి 18.63 శాతానికి తగ్గింది. పప్పు ధాన్యాల ధరలు 16.61 శాతం నుంచి 15.85 శాతానికి తగ్గగా, తృణ ధాన్యాల ధరలు 5.23 శాతం నుంచి 5.30 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల్లో అధిక ప్రాధాన్యమున్న పెట్రో ఉత్పత్తుల ధరలు 6.36 శాతం నుంచి 6.59 శాతానికి పెరిగాయి.
ఆరు శాతానికి పైగా ద్రవ్యోల్బణం పెరిగిన ఉత్పత్తుల్లో మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, నూనె, కొవ్వు పదార్థాలు, గుడ్లు తదితరాలున్నాయి. పండ్లు, తీపి పదార్థాల ఉత్పత్తులు, ఆల్కహాలేతర పానీయాలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల ధరల్లో 2 నుంచి 4 శాతం మార్పు నమోదైందని ఎన్ఎస్ఓ వెల్లడించింది.