Corona Virus: ఓ దొంగను జైలుకెళ్లకుండా కాపాడిన కరోనా... పట్టుకున్న పోలీసుల్లో టెన్షన్ టెన్షన్!
- జువైనల్ హోమ్ కు వెళ్లి వచ్చినా మారని తీరు
- వైద్య పరీక్షల కోసం తీసుకెళితే హోమ్ క్వారంటైన్
- జైల్లోకి అనుమతించని చంచల్ గూడ అధికారులు
- కోర్టు ఆదేశాలతో హోమ్ క్వారంటైన్
చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడి, జువైనల్ హోమ్ లో శిక్షను అనుభవించి బయటకు వచ్చిన తరువాత కూడా తన పద్ధతి మార్చుకోని ఓ ఘరానా దొంగను, ఇప్పుడు జైలుకు వెళ్లకుండా కరోనా కాపాడింది. మరోపక్క, అతన్ని పట్టుకున్న హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు, వారి కుటుంబాల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే...
నల్గొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్ మహేశ్ (19) తన 15వ ఏట నుంచే దొంగతనాల బాట పట్టాడు. 50కి పైగా నేరాలు చేసిన తరువాత 2017లో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, జువైనల్ హోమ్ కు పంపించారు. అక్కడ మహేశ్ కు వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించిన అధికారులు హైదరాబాద్ లోని ఎన్ఏసీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్ స్ట్రక్షన్)లో ఉద్యోగం ఇప్పించారు. అయితే, అక్కడి నుంచి పరారైన మహేశ్ కు, లాక్ డౌన్ కు వారం రోజుల ముందు మైనార్టీ తీరింది.
ఆ తరువాత లాక్ డౌన్ మొదలయ్యేలోగా, నాలుగు నేరాలు చేశాడు. ఇతనిపై కన్నేసిన ఈస్ట్ జోన్ పోలీసులు, అరెస్ట్ చేసి, ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇతను జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉండటంతో, వైద్యులు అతని చేతిపై 14 రోజుల క్వారంటైన్ ముద్ర వేశారు. ఆపై మహేశ్ ను న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించగా, క్వారంటైన్ స్టాంప్ ను చూసిన జైలు అధికారులు, అతన్ని జైల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్న పోలీసులు, మరోమారు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, అతన్ని హోమ్ క్వారంటైన్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో అతన్నుంచి వ్యక్తిగత బాండ్ ను తీసుకుని, చంటపల్లి తండాకు తీసుకెళ్లి హోమ్ క్వారంటైన్ చేసి వచ్చారు. అతనికి క్వారంటైన్ స్టాంప్ పడిందన్న విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, కంచన్ బాగ్ పోలీసులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మహేశ్ కు కరోనా సోకకుండా ఉండాలని అతనికన్నా, పోలీసుల కుటుంబీకులే ఎక్కువగా కోరుకుంటున్నారు.