Sonia Gandhi: ప్రధాని ప్రకటనకు ముందు... జాతిని ఉద్దేశించి సోనియా గాంధీ వీడియో సందేశం!

Sonia Gandhi Video Message to Nation

  • కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • ప్రజలకు ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
  • ముందస్తు సన్నాహాలు లేకుండా లాక్ డౌన్ తో నష్టమన్న సోనియా

కరోనా వైరస్ పై పోరుకు పాటిస్తున్న లాక్ డౌన్ కొనసాగింపుపై ఈ ఉదయం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయనున్న వేళ, అంతకన్నా ముందుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియమైన దేశ ప్రజలారా..." అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో, కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని సూచించారు.

వైరస్ భయాందోళనలు తగ్గేంత వరకూ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అన్నారు. ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ కూడా ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని అన్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ ధన్యవాదాలని వ్యాఖ్యానించారు.

ఇక, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తున్నారని, దీనివల్ల దేశం నష్టపోతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News