Khammam District: నిబంధనలు గాలికి.. గెస్ట్‌హౌస్‌లో మందుపార్టీ చేసుకున్న కోవిడ్‌ అధికార బృందం!

Mandal Officials Busy in Liquor party In Khammam

  • ఖమ్మం జిల్లా మధిరలో ఘటన
  • భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలకు అవగాహన
  • వారు మాత్రం అది వదిలేసి ఎంచక్కా మందుపార్టీ

కరోనా వైరస్ కట్టడి విధుల్లో ఉన్న అధికారులు కొందరు లాక్‌డౌన్ నిబంధనలు గాలికి వదిలేసి, భౌతిక దూరాన్ని అటకెక్కించేసి ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిన్న రాత్రి జరిగిందీ ఘటన. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లడంతో చెరో దిక్కుకు పరుగులు తీశారు. ఓ అధికారి అయితే బాత్రూములో దూరి అరగంటకు పైగా అందులోనే ఉన్నారు. ఆ తర్వాత తలుపు తడితే తీసి పరుగో పరుగు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మండలస్థాయి అధికారులు 8 మంది కోవిడ్-19 విధుల్లో ఉంటూ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే భౌతికదూరం పాటించాలంటూ హోరెత్తిస్తున్నారు.

 అయితే, విచిత్రంగా సోమవారం వీరంతా భౌతికదూరం నిబంధనను గాలికొదిలేసి మండల అధికారి విశ్రాంతి భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లగానే తలో దిక్కుకు పరిగెత్తారు. ఓ అధికారి బాత్రూములో దూరి గడియపెట్టుకోగా, మిగిలినవారు గోడదూకి పరారయ్యారు. బాత్రూములో నక్కిన అధికారి కూడా అరగంట తర్వాత బయటకొచ్చి పరుగందుకున్నాడు. మద్యం, మాంసం, ఇతర ఆహార పదార్థాలు అక్కడే వదిలేసి పరుగులు తీశారు. అంతేకాదు, అక్కడి వంట గదిలో ఖరీదైన మద్యం సీసాలు మరిన్ని కనిపించాయి. సమాచారం  అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్‌కు చేరుకుని పరిశీలించారు.

  • Loading...

More Telugu News