Street Dogs: వీధి కుక్కలతో కలసి నేల'పాల'ను పంచుకుంటున్న నిరాశ్రయుడు... ఆగ్రాలో హృదయవిదారక దృశ్యం.. వీడియో ఇదిగో!
- రోడ్డుపై మిల్క్ వ్యాన్ కు ప్రమాదం
- మట్టి పాత్రలోకి పాలను దోసిళ్లతో ఎత్తి పోసుకుంటున్న వ్యక్తి
- తాజ్ మహల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఘటన
కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న వేళ, కొన్ని ప్రాంతాల్లో నిరాశ్రయులు, మూగ జీవాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నా అన్నవారులేక, రోడ్డుపై ఒంటరిగా మిగిలిన ఓ వ్యక్తి, వీధి కుక్కలతో కలిసి నేలపాలైన పాల కోసం కష్టపడ్డాడు.
నడిరోడ్డుపై పారుతున్న పాలను, వీధి కుక్కలు తాగుతూ ఉంటే, కాస్తంత దిగువన అవే పాలను తన రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నాడో వ్యక్తి. యూపీలోని ఆగ్రా పట్టణంలో, రామ్ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాలను తీసుకుని వెళుతున్న ఓ కంటెయినర్ ప్రమాదానికి గురికాగా, పాలన్నీ నేలపాలయ్యాయి.
ఈ పాలను సదరు వ్యక్తి, మట్టి పాత్రలోకి దోసిళ్లతో ఎత్తి పోస్తుండగా, వీధి కుక్కలు తమ ఆకలిని తీర్చుకునేందుకు ప్రయత్నించాయి. తాజ్ మహల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) గణాంకాల ప్రకారం, ఇండియాలో లాక్ డౌన్ కారణంగా 40 కోట్ల మంది కార్మికులకు ఉపాధి కరవైంది. వీరికి ఆహారంతో పాటు ధన సహాయం చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, అది క్షేత్రస్థాయిలో అందరికీ అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.