Tamil Nadu: తమిళనాడు కరోనా బాధితుల్లో 31 మంది చిన్నారులు
- తమిళనాడులో 1173 కరోనా కేసులు
- ప్రాణాలు కోల్పోయిన 11 మంది
- కరోనా సోకిన చిన్నారులంతా పదేళ్లలోపు వారే
తమిళనాడులో నమోదైన కరోనా కేసుల్లో 31 మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వీరంతా పదేళ్లలోపు చిన్నారులేనని ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్ తెలిపారు. తమిళనాడులో నిన్నటి వరకు 1173 కరోనా కేసులు నమోదు కాగా, 11 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 98 కేసులు నమోదైనప్పటికీ మరణాలు సంభవించకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,746 మందికి పరీక్షలు నిర్వహించగా నిన్న 2,091 మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయని, వీటిలో 98 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, మిగతా వారికి నెగటివ్ అని వచ్చిందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 33,850 మంది హోం క్వారంటైన్లో ఉండగా, 63,380 మంది 28 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నట్టు రాజేశ్ తెలిపారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో బాధితులకు చికిత్స చేయడానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కాగా, నిన్నటికి రాష్ట్రంలో కొత్తగా 34 ల్యాబ్లు అందుబాటులోకి వచ్చినట్టు రాజేశ్ తెలిపారు.