Saptapadi: దేశ ప్రజలకు మోదీ 'సప్తపది'... ఈ ఏడూ పాటించాలని చేతులెత్తి మొక్కుతూ వినతి!
- వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
- రోగ నిరోధక శక్తి, ఆరోగ్య సేతు యాప్, ప్రైవేటు ఉద్యోగుల ప్రస్తావన
- డాక్టర్లకు గౌరవం ఇస్తూ, పేదలకు ఆహారం అందించాలని వినతి
ఈ ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలు తప్పక పాటించాల్సిన ఏడు సూత్రాలతో తాను ఓ 'సప్తపది'ని ప్రకటిస్తున్నానని అన్నారు. వచ్చే 19 రోజుల పాటు ఈ ఏడు ముఖ్యమైన అంశాలనూ ప్రజలు అమలు చేయాలని అన్నారు.
మోదీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఇవి.
1. వయసు పైబడిన పెద్దవాళ్లను కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి.
2. అత్యవసర విధుల్లో ఉన్న డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలి.
3. పేదలకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించేందుకు వీలైనంత మేరకు మరింత సాయం అందించాలి.
4. ప్రైవేటు ఉద్యోగులపై వేటు వేసే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు.
5. రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా, పోషకాహారాన్ని తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి.
6. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి.
7. భౌతిక దూరం పాటించడంతో కరోనా దూరం అవుతుంది కాబట్టి, బయటకు వెళితే, ఒకరితో ఒకరు దగ్గరగా మసలవద్దు.
ఈ ఏడు సూత్రాలనూ పాటించడం ద్వారా ఇండియా నుంచి కరోనాను శాశ్వతంగా పారద్రోలవచ్చని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలు వీటిని విధిగా పాటించాలని నమస్కరిస్తూ మోదీ కోరారు.