Vijay Sai Reddy: వారి సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయి: విజయసాయిరెడ్డి
- మీడియా ప్రచారాన్ని జగన్ అస్సలు కోరుకోరు
- జగన్ గారి అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైంది
- ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది
- వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు అద్భుతం
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా సైతం ప్రశంసిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయని చెప్పారు.
'పాలనా దక్షత అంటే సీఎం జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. అందరి సలహాలు తీసుకుంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తారు. వాటిని అమలు చేసే స్వేచ్ఛ అధికారులకిచ్చారు. పని జరగాలంతే. మీడియా ప్రచారం ఆయన అస్సలు కోరుకోరు. రాష్ట్రం బాగుంటే చాలని కోరుకుంటారు యువ సీఎం' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
'జగన్ గారి అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయి. వాలంటీర్లు మూడుసార్లు ఇంటింటి సర్వే చేసి పౌరుల ఆరోగ్య చరిత్రను రికార్డు చేయడం గర్వించదగ్గ విషయం' అని చెప్పారు.
'యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని ఎన్డీటీవీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించింది. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా?' అని ఆయన ప్రశ్నించారు.