Corona Virus: అమెరికాలో తీవ్రత తగ్గుతోంది: డొనాల్డ్ ట్రంప్
- ప్రభుత్వ చర్యలు ఫలితాలనిస్తున్నాయని వెల్లడి
- అధిక ప్రభావం ఉన్న నగరాల్లో కొత్త కేసులు తగ్గాయన్న ప్రెసిడెంట్
- అయినా ఆగని మరణాలు.. నిన్న ఒక్కరోజే 1509 మంది మృతి
కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశం అమెరికానే. అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువ అవుతోంది. అత్యధికంగా 23 వేల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, దేశంలో వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ, మిషిగాన్, లూసియానాలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెప్పారు. ఈ లెక్కన ప్రభుత్వ మార్గనిర్దేశాలను ప్రజలు పాటిస్తున్నారని చెప్పొచ్చని ఆయన అన్నారు. ఇక, దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అధికారం అధ్యక్షుడిగా పూర్తిగా తన చేతుల్లోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ‘అమెరికా రీఓపెన్’కు సంబంధించిన ప్లాన్ రూపకల్పన చివరి దశకు వచ్చిందని చెప్పారు.
అమెరికాలో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చీఫ్ మాత్రం ట్రంప్ వాదనకు భిన్నంగా స్పందించారు. గత వారంలో అధిక కేసుల వచ్చాయన్నారు. కరోనా కారణంగా దేశంలో చాలా మంది చనిపోతారని అంచనా వేశారు. కాగా, గడచిన 24 గంటల్లో అమెరికాలో 1509 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 23,529కి చేరింది. ఒక్క న్యూయార్క్‌లోనే మరణాల సంఖ్య 10 వేలు దాటింది. నిన్న ఒక్క రోజే అక్కడ 722 మంది చనిపోవడం గమనార్హం. అక్కడ లక్షా 61 వేల మంది వైరస్ బారిన పడ్డారు.