Corona Virus: హైదరాబాద్ నగరంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఉన్నతస్థాయి సమావేశం
- పాల్గొన్న ఈటల, కేటీఆర్
- పోలీసు అధికారులతో చర్చలు
- ప్రస్తుత స్థితిగతులపైన చర్చిస్తోన్న నేతలు
లాక్‌డౌన్ పొడిగింపుతో హైదరాబాద్ నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.
'తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అదుపు చేయటానికి అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతులపైన సమావేశం కొనసాగుతోంది' అని తెలంగాణ ఐటీ శాఖ తెలిపింది.
'ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ,రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో పాటు పలువురు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు' అని పేర్కొంది. ఈ సమావేశంలోనూ మంత్రులు, అధికారులు సామాజిక దూరం పాటిస్తున్నారు.
మరోవైపు, హైదరాబాద్ పోలీసు అధికారులతో సినీనటుడు విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తానని చెప్పాడు.