Shahrukh Khan: కరోనాపై పోరుకు భారీగా పీపీఈ కిట్లు అందించిన షారుఖ్ ఖాన్
- 25,000 పీపీఈలను ఇచ్చారన్న మంత్రి రాజేశ్ తోపే
- పలు సంస్థలతో కలిసి పనిచేస్తోన్న షారుఖ్
- సాయం చేసినందుకు ఆనందంగా ఉందన్న బాలీవుడ్ హీరో
కరోనాపై జరుగుతోన్న పోరాటంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన వంతు సాయంగా వైద్య సిబ్బంది కోసం 25,000 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆయన చేసిన సాయానికి మహారాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేశ్ తోపే కృతజ్ఞతలు తెలిపారు.
షారుఖ్ ఖాన్ చేసిన సాయం కరోనాపై జరుపుతున్న పోరాటానికి చాలా మేలు చేస్తుందని రాజేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మనల్ని, మానవాళిని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మనందరం కలిసి పోరాడాలని షారుఖ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి సాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాగా, ఆయన ఇప్పటికే తన కార్యాలయాన్ని మహిళలు, వృద్ధులు, చిన్నారులకు వైద్య సహాయం అందించే క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని షారుఖ్ ప్రకటించారు. కోల్కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ వంటి సంస్థల సాయంతో షారుఖ్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.