spain: స్పెయిన్ లో కరోనా తగ్గుముఖం.. లాక్‌డౌన్ పాక్షికంగా సడలింపు
- నిర్మాణ, ఉత్పత్తి రంగాల పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి
- ఇతర కార్యకలాపాలపై ఈ నెల 26 వరకూ పూర్తిగా నిషేధం
- లాక్‌డౌన్ సడలింపుపై కొంత మంది అభ్యంతరం
స్పెయిన్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను పాక్షికంగా సడలించారు. నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో పరిశ్రమలు తిరిగి తెరిచేందుకు, కార్మికులు పనులకు వెళ్లేందుకు అనుమతించారు. కానీ, మిగతా అన్ని రకాల కార్యకలాపాలపై ఆంక్షలు కఠినంగా కొనసాగిస్తున్నారు. స్పెయిన్ లో షాపులు, బార్లు, పబ్లిక్ ప్లేసుల మూసివేత ఈనెల 26 వరకూ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ నిబంధనల వల్ల స్పెయిన్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. ఆదివారం 619 కొత్త కేసులు నమోదు కాగా, సోమవారం 517కు తగ్గాయి. దేశంలో ఇప్పటిదాకా 1.69 లక్షల పాజిటివ్ కేసులు తేలగా.. 17,489 మంది చనిపోయారు. అయితే, పరిస్థితి ఇంకా మెరుగవ్వక ముందే లాక్ డౌన్ ను సడలించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అంటున్నారు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా స్పెయిన్ ఎకానమీ బాగా దెబ్బతిన్నదని నిపుణులు చెబుతున్నారు. మార్చి మూడో వారం నుంచి ఇప్పటికే 90 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.