south africa: లాక్‌డౌన్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో పెరిగిపోయిన దోపిడీలు
- 180కి పైగా బడుల్లో చోరీలు
- మద్యం దుకాణాల్లోనూ దొంగతనాలు
- చోరీల వెనుక పెద్ద సిండికేట్
- ఇద్దరు పోలీసులూ అరెస్టు
దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణను అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దోపిడీలు పెరిగిపోతున్నాయి. బడులు, మద్యం దుకాణాల్లోకి చొరబడుతున్న చాలా మంది చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 27 నుంచి దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తాజాగా మరో ప్రకటన చేసింది.
అయితే, ఇప్పటివరకు ముఖ్యంగా 180కి పైగా బడుల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనలపై ఆ దేశ మంత్రి మంత్రి ఆంగీ మోశెగా మాట్లాడుతూ.. దేశంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అక్రమంగా డ్రగ్స్, మద్యం కొనుగోళ్ల కోసం కొందరు పాఠశాలల్లో దొంగతనాలు చేస్తున్నారని వివరించారు.
దీనివల్ల పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక, లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాల్లోనూ పెద్ద ఎత్తున దోపిడీలు జరుగుతున్నాయి. ఈ నేరాల వెనుక పెద్ద సిండికేటే ఉంది. ఈ చోరీ కేసుల్లో దొంగలే కాకుండా ఇద్దరు పోలీసు అధికారులు, ఒక మద్యం దుకాణం మేనేజర్ పట్టుబడ్డారు. మద్యాన్ని దుకాణాల్లో నుంచి చోరీ చేసి, బయటి మార్కెట్‌లో బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు.