Consumer Affairs Ministry: విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు చేయక్కర్లేదు: కేంద్ర ఆహార, ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ

Center Warns Those Unwilling to continue Jobs Can Relieve

  • కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నా హాజరుకాని ఉద్యోగులు
  • ఆఫీసుకు వెళ్లరాదని భావిస్తే, 20లోగా తెలియజేయండి
  • హాజరు కాని ఉద్యోగులకు లేఖలు రాసిన మంత్రిత్వ శాఖ

అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తూ, గత కొన్ని రోజులుగా కరోనా సాకు చూపి విధులకు హాజరుకాని అధికారులపై కొరడా ఝళిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎవరైతే విధులకు హాజరుకాలేదో, వారిని రిలీవ్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తూ, రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ, తమ ఉద్యోగులకు ఓ లేఖను రాసింది.

సేవలందించడంలో అలసత్వం చూపినా, విధులకు హాజరు కాకున్నా, అటువంటి ఉద్యోగులు అవసరం లేదని స్పష్టం చేసింది. కన్స్యూమర్ అఫైర్స్ విభాగంలోని అందరు అధికారులు, ఇతర ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ ఎవరికైనా విధులకు హాజరు కారాదన్న ఆలోచన ఉంటే, వారు 20వ తేదీలోగా తమతమ శాఖలకు సమాచారాన్ని ఇవ్వాలని, అప్పుడు వారిని రిలీవ్ చేస్తామని వెల్లడించింది.

ఇక, లాక్ డౌన్ సమయంలో పలు కార్యాలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. తిరిగి వీరందరినీ విధుల్లోకి ఆహ్వానిస్తూ, సోమవారం నుంచి తప్పనిసరిగా హాజరు కావాలని టెలిఫోన్ లో ఉన్నతాధికారులు సూచించారు. అయినప్పటికీ, అత్యధిక శాతం ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఇతర అత్యవసర మంత్రిత్వ శాఖల్లోనూ ఇదే విధమైన ఆదేశాలు జారీ అయ్యాయా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. 

  • Loading...

More Telugu News