Indian Railways: లాక్‌డౌన్ పొడిగింపు ఎఫెక్ట్.. 39 లక్షల టికెట్లను రద్దు చేసిన రైల్వే!

Around 39 lakh train tickets will be cancelled between April 15 and May 3

  • ఏప్రిల్ 15 నుంచి మే 3 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న 39 లక్షల మంది
  • పూర్తి సొమ్మును వెనక్కి ఇస్తామన్న రైల్వే
  • కౌంటర్లలో రిజర్వు చేసుకున్న వారికి జులై 31 వరకు గడువు

నిన్నటితో ముగియాల్సిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించిన నేపథ్యంలో భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి మే 3 మధ్య బుక్ అయిన 39 లక్షలకుపైగా టికెట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి నిన్నటితో లాక్‌డౌన్ ముగుస్తుందని, ఆ తర్వాత రైళ్లు తిరుగుతాయని భావించిన లక్షలాదిమంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఇంకా భయపెడుతుండడంతో లాక్‌డౌన్‌ను కేంద్రం మరికొన్ని రోజులు పొడిగించింది.

ఈ నేపథ్యంలో రైల్వే కూడా రైలు సర్వీసులను అప్పటి వరకు రద్దు చేసింది. 39 లక్షల టికెట్లను రద్దు చేయడంతో పాటు మే 3 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, అడ్వాన్స్ బుకింగులను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు అక్కడే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని వివరించింది. వీరికి జులై 31 వరకు అవకాశం ఇచ్చింది.

  • Loading...

More Telugu News