IMF: రానున్నది మరో 'మహా ఆర్ధిక మాంద్యం'... వందేళ్ల వ్యవధిలో అతిపెద్దదన్న ఐఎంఎఫ్!

IMF Warns World in Deep Recession
  • ఎన్నో ఏళ్లు పట్టి పీడించనున్న మాంద్యం
  • ప్రపంచానికి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం
  • రికవరీ వస్తే మాత్రం గణనీయమైన వృద్ధి
  • రిపోర్టును విడుదల చేసిన ఐఎంఎఫ్
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గడచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత మాద్యంలోకి కూరుకుపోనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ప్రపంచ జీడీపీ ఇప్పటికే 3 శాతానికి పైగా పడిపోయిందని, వైరస్ కారణంగా ఏర్పడే మాంద్యం, ఎన్నో ఏళ్లు పట్టి పీడించనున్న మరో మహమ్మారి అని అభిప్రాయపడింది. మాంద్యం కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 9 ట్రిలియన్ డాలర్లు నష్టపోనుందని అంచనా వేసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్, తాజా అంచనాలను మీడియాకు విడుదల చేశారు.

వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చి, పరిస్థితి కుదుటపడితే, 2021లో 5.8 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆమె అంచనా వేశారు. ప్రస్తుతం వేసిన అంచనాలు కచ్చితత్వంతో కూడినవి కాదని, పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇప్పటికే షట్ డౌన్ అయ్యాయని, ఆరోగ్య వ్యవస్థలను కాపాడుకోవడంపైనే దృష్టిని సారించాయని వెల్లడించిన ఆమె, రికవరీ మొదలైనా, అది ఎంత బలంగా ఉంటుందన్న విషయంపైనా అనిశ్చితి నెలకొని వుందని పేర్కొంది.

ఇక 2020, 2021లో వైరస్ కారణంగా ఏర్పడే నష్టం, జపాన్, జర్మనీల ఆర్థిక వ్యవస్థలను కలిపితే వచ్చే మొత్తానికన్నా అధికమేనని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇప్పటికే వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ప్రజలు బాధపడుతూ ఉండగా, 1.20 లక్షల మందికి పైగా మరణించారు. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోగా, వాణిజ్య కార్యకలాపాలు మూతపడ్డాయి. టూరిజం పూర్తిగా దెబ్బతింది. సమీప భవిష్యత్తులో మరింత నష్టం కళ్లముందు కనిపించనుందని, వైరస్ మహమ్మారి మరింత కాలం కొనసాగినా, కేసుల సంఖ్య బాగా పెరిగినా, ఎన్నో సంస్థలు మూతపడతాయని, నిరుద్యోగ సమస్య ఆకాశానికి ఎగబాకుతుందని హెచ్చరించింది.

ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ల కీలక సమావేశాలు జరుగనున్న తరుణంలో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. 1929లో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్ తరువాత, ఈ మాంద్యం అత్యంత ప్రభావాన్ని చూపనుందని వ్యాఖ్యానించిన ఐఎంఎఫ్, ప్రపంచ పరిస్థితిని 'ది గ్రేట్ లాక్ డౌన్' అని అభివర్ణించింది.
IMF
Corona Virus
Report
GDP
Lockdown
Global Ression

More Telugu News