Puducherry: లాక్ డౌన్ ను ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రెండోసారి కేసు నమోదు
- నిబంధనలను ఉల్లంఘించిన పుదుచ్చేరి ఎమ్మెల్యే జాన్ కుమార్
- 150 మందికి బియ్యం పంచిన వైనం
- గతంలో కూడా 200 మందికి కాయగూరల పంపకం
లాక్ డౌన్ నిబంధనలను దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఉల్లంఘిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. నిబంధనలు కేవలం సామాన్యులకేనన్నట్టుగా నేతలు ప్రవర్తిస్తున్నారు. పుదుచ్చేరిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి... జనాలకు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా పాల్గొన్నారు. దీంతో, రెవెన్యూ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జాన్ కుమార్ పై ఈ విధమైన కేసు నమోదు కావడం ఇది రెండో సారి. గతంలో కూడా ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఇంటి ముందు దాదాపు 200 మందికి కాయగూరలు పంపిణీ చేశారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి జాన్ కుమార్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మరోవైపు, లాక్ డౌన్ సమయంలో చట్ట విరుద్ధంగా మందు అమ్ముతున్న 22 వైన్ షాపులను అధికారులు సీజ్ చేశారు.