Vijayasai Reddy: పాతికసార్లు ప్రాధేయపడితే కాల్ చేసి వుంటారు: చంద్రబాబుకు విజయసాయి రెడ్డి చురక
- మోదీ పారిశుద్ధ్య కార్మికులతోనే మాట్లాడారు
- నిత్యం ఆయన ఎంతో మందికి ఫోన్ చేస్తారు
- దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విసుర్లు
తాను ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నానని పీఎంఓ కార్యాలయానికి కాల్ చేసి చెబితే, ఆ వెంటనే ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఓ పాతికసార్లు ప్రాధేయపడివుంటారని, అందుకే మోదీ కాల్ చేసి ఉండవచ్చని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయి, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
"ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోంది" అని అన్నారు.
ఆపై, "ఏం మొహం పెట్టుకుని ఏపికి వస్తాడు. మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీగారు మర్చిపోయుంటాడని అనుకుంటున్నాడు. ఆయనది అపార జ్ఞాపకశక్తి. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరు" అంటూ బాబుపై సెటైర్లు వేశారు.