Liquor: ఇంట్లో లిక్కర్ తయారు చేసుకోవడం ఎలా?: గూగుల్ లో ట్రెండింగ్
- మందు దొరక్క తల్లడిల్లిపోతున్న మందుబాబులు
- బ్లాకులో చుక్కలను అంటుతున్న ధరలు
- సొంతంగా తయారు చేసుకుంటే పోలా అనుకుంటున్న వైనం
లాక్ డౌన్ నేపథ్యంలో మందుబాబులు పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. ఇప్పటికే మందు వాసన చూసి వారాలు గడిచాయి. లాక్ డౌన్ ఎప్పటికి ఎత్తేస్తారో? మందు ఎప్పటి నుంచి దొరుకుతుందో? అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు.
మరోవైపు బ్లాక్ లో మందు దొరుకుతున్నప్పటికీ... దాని ధర చుక్కలను తాకుతోంది. హైదరాబాదులో క్వార్టర్ రూ. 140 ఉండే లిక్కర్ ను బ్లాక్ లో రూ. 750కి అమ్ముతున్నారు. బీరు రూ. 400-450 మధ్యలో లభిస్తోంది. ఒక వేళ కొందామని డబ్బు రెడీ చేసుకున్నా.. అది చేతి వరకు వస్తుందో? లేదో? అనే డౌట్. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది.
దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు... సొంతంగా మందు తయారు చేసుకుంటే పోలా? అని మందుబాబులు ఆలోచిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా గూగుల్ లో 'ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?' అని వెతుకుతున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్ లైన్ సర్చింగ్ లో ఇదే టాప్!