Corona Virus: కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొంటున్నది మనమే: కేంద్రమంత్రి హర్షవర్ధన్
- ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాం
- చైనాలో వైరస్ను గుర్తించిన వెంటనే మనం అప్రమత్తమయ్యాం
- రోజుకు లక్ష పరీక్షలు చేయాలని యోచిస్తున్నాం
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19ను ఎదుర్కొంటున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు మనం ఆదర్శంగా నిలిచామన్నారు. చైనాలో కరోనా వైరస్ను గుర్తించగానే తొలుత అప్రమత్తమైన దేశాల్లో భారత్ ఒకటన్నారు.
వైరస్ను చైనా గుర్తించిన వెంటనే జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశమయ్యామని, 17న ఆరోగ్య సూచనలు విడుదల చేశామని మంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పిన మంత్రి.. ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. వైరస్ ప్రభావం ముంబైలో చాలా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.