Mumbai: బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వినయ్ దూబె అరెస్ట్

Cops Detain Vinay Dubey For Instigating Migrant Workers
  • తనను తాను కార్మిక నేతగా చెప్పుకుంటున్న దూబె
  • అతడి సోషల్ మీడియా పోస్టులే కొంప ముంచాయంటున్న పోలీసులు
  • ‘ఇంటికి వెళదాం’ పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం
ముంబై బాంద్రాలో నిన్నటి ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ ముగియడంతో వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసిందన్న పుకారుతో నిన్న వందలాదిమంది వలస కార్మికులు బాంద్రా స్టేషన్‌కు చేరుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసలే కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారిన ముంబైలో వేలాదిమంది ఎటువంటి మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుమికూడారు. వీరిని వెనక్కి పంపేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. కాగా, ఈ పుకార్లకు కారణంగా భావిస్తున్న వినయ్ దూబె అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

వినయ్ దూబెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. 14తో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా దూబె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిర్ణయం కోసం 14వ తేదీ వరకు వేచి చూస్తామని, లేదంటే ఆ రోజున అందరం కలిసి కాలినడకన బయలుదేరుతామని పేర్కొన్నాడు.

తనను తాను కార్మిక నేతగా చెప్పుకుంటున్న దూబె.. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచే కార్మికుల్లో ఇటువంటి ఆశలు రేపాడని పోలీసులు చెబుతున్నారు. ‘చలో ఘర్ కీ ఓర్’ (ఇంటికి వెళదాం) పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమాన్ని కూడా నడిపినట్టు పోలీసులు తెలిపారు. బాంద్రాలో నిన్న అంతమంది గుమికూడడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్‌‌లలోని అతడి పోస్టులే కారణమని అనుమానిస్తున్న పోలీసులు నవీ ముంబైలో ఈ రోజు అతనిని అరెస్ట్ చేశారు.
Mumbai
Bandra
Migrant workers
Maharashtra

More Telugu News