SBI: ఏటీఎం సర్వీస్ చార్జీలను తాత్కాలికంగా ఎత్తేసిన ఎస్‌బీఐ.. ఉచిత లావాదేవీల పరిమితులు తొలగింపు
- అన్ని ఏటీఎంల్లో ట్రాన్సాక్షన్‌లకు ఇది వర్తింపు
- కరోనా కష్టకాలంలో ఖాతాదారులకు భరోసా
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
కరోనా కష్టకాలంలో ఖాతాదారులపై అదనపు భారం ఉండకూదన్న ఉద్దేశంతో ఎస్‌బీఐ ఏటీఎం సర్వీస్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయించింది. అలాగే ఏటీఎంలలో చేసే ఉచిత లావాదేవీల పరిమితులను కూడా ఎత్తివేసింది. ఈ నిర్ణయం జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో ఖాతాదారులు ఏ ఏటీఎంలోనైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి అదనపు చార్జీలు విధించరు.
ఖాతాదారులు ఈ నిర్ణయాలను ఉపయోగించుకుంటూనే సైబర్ మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదే అదనుగా మోసగాళ్లు సంప్రదించి నెట్ బ్యాంకింగ్ లింక్‌లు పంపుతారని, అటువంటి వాటిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా బ్యాంకు శాఖలోనే సంప్రదించాలి తప్ప, ఫోన్‌లో బ్యాంకు అధికారులమంటూ చెప్పిన వారి మాటలను నమ్మవద్దని కోరారు.