Erapatineni Srinivas: ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత యరపతినేని విమర్శలు
- నిమ్మగడ్డ రమేశ్ రాసిన లేఖను టీడీపీ తయారు చేసిందంటారా?
- ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం తగదు
- ‘కరోనా’ కట్టడికి ప్రభుత్వ చర్యలు తృప్తికరంగా లేవు
కేంద్ర హోం శాఖకు నాడు ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖ టీడీపీ తయారు చేసిందంటూ ఏపీ డీజీపీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ లేఖపై నిన్న రమేశ్ కుమార్ స్పష్టత నివ్వడంతో విజయసాయిరెడ్డి ప్రణాళిక బెడిసికొట్టిందని విమర్శించారు.
ఈ సందర్భంగా ఏపీలో ‘కరోనా’ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తృప్తికరంగా లేవని, ప్రజలకు సంబంధిత పరీక్షలు సరిగా చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ‘కరోనా’ విజృంభిస్తోంటే, అంత తీవ్రత లేనట్టుగా చూపుతోందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెడుతోందని ధ్వజమెత్తిన యరపతినేని, లాక్ డౌన్ సమయంలోనూ పల్నాడు ప్రాంతంలో మద్యాన్ని అక్రమ సరఫరా చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు.