IPL: అనుకున్నదే జరిగింది... ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ

BCCI postpones IPL latest season

  • వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
  • కరోనా విజృంభణతో నిలిచిపోయిన వైనం
  • తదుపరి ప్రకటన వచ్చేవరకు ఐపీఎల్ వాయిదా వేస్తున్నామన్న బీసీసీఐ

కొవిడ్-19 రక్కసి ప్రపంచంలోని మెజారిటీ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో క్రీడారంగం కూడా స్థంభించిపోయింది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ పైనా కరోనా ప్రభావం పడింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఈ క్రికెట్ లీగ్ ను కొన్నిరోజుల పాటు నిలిపివేసిన బీసీసీఐ తాజాగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఐపీఎల్ తాజా సీజన్ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ చీఫ్ గంగూలీ కొన్నిరోజులుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, నానాటికీ వైరస్ విజృంభణ తీవ్రమవుతుండడంతో కీలక నిర్ణయం తీసుకోకతప్పలేదు. తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యం అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా పేర్కొన్నారు. ఫ్రాంచైజీ ఓనర్లు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, వాటాదారులందరూ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తున్నామని, కేంద్రం మార్గదర్శకత్వంలో కొనసాగుతామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న పిదప అందరినీ సంప్రదించి ఐపీఎల్ పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News