Corona Virus: మనమే కాదు, ఈ రెండు దేశాలు కూడా కరోనా కట్టడిలో ముందంజలో ఉన్నాయి!
- అగ్రరాజ్యాలు సైతం కరోనాతో విలవిల
- భారత్ వంటి కొన్ని దేశాల్లో తక్కువ నష్టం
- ముందే మేల్కొన్న ఆస్ట్రేలియా, కెనడా దేశాలు
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లతో పోల్చితే భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువనే చెప్పాలి. కొన్నివారాల కిందట చైనాను దాటి ఇతర దేశాలకు పాకిన కరోనా మహమ్మారి కొద్దికాలంలోనే లక్షమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. కానీ భారత్ లో మరణాల సంఖ్య ఇప్పటికీ వందల్లోనే ఉంది. అందుకు కారణం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే. కరోనా ఉనికిని ప్రాథమిక దశలోనే పసిగట్టిన భారత్ సంపూర్ణ లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించి దారుణ పరిస్థితుల నుంచి తప్పించుకుంది.
అయితే, భారత్ మాత్రమే కాదు, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు కూడా కరోనా విషయంలో ఎంతో ముందుజాగ్రత్తతో వ్యవహరించాయి. ఆస్ట్రేలియాలో 6,468 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా, కేవలం 63 మరణాలు సంభవించాయి. 3,747 మంది కోలుకున్నారు. ఇక, కెనడాలో 28,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,048 మరణాలు సంభవించాయి. 9,310 మంది కోలుకున్నారు. ఈ రెండు దేశాలకున్న వైద్య సంపత్తి సాయంతో లక్షల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రోగులను ముందుగానే గుర్తించి క్వారంటైన్ కు తరలించాయి. దాంతో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. భారత్ లో పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహించలేకపోయినా, ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వాల కఠినచర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.