TCS: ఉద్యోగులను ఎవర్నీ తొలగించం.. టీసీఎస్ స్పష్టీకరణ

NO lay off in TCS says CEO

  • ఒక్క ఉద్యోగిని కూడా ఇంటికి పంపే ఉద్దేశం లేదు
  • ఈ ఏడాదికి జీతాల పెంపు మాత్రం ఉండదు
  • సంస్థలో 4.5 లక్షల మంది సిబ్బంది

కరోనా కష్టకాలంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు ఊరటనిచ్చే కబురు అందించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా కష్టకాలం ముందున్నప్పటికీ ఉద్యోగుల్లో ఒక్కరిని కూడా తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాదికి జీతాల పెంపుదల మాత్రం ఉండక పోవచ్చునని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా అన్నిరంగాల్లోనూ ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత వేగవంతంగా సాగుతున్న సమయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ తమ  సంస్థంలోని నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే మాట చెప్పి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది.

మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంస్థ మంచి లాభాలనే అందిపుచ్చుకున్నప్పటికీ వచ్చే రెండు త్రైమాసికాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చునని ఊహిస్తోంది. 'భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని భావిస్తున్నాం. అయినా ఉద్యోగాల్లో కోత వేయకూడదన్నది యాజమాన్యం నిర్ణయం' అని టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథ్ తెలిపారు.

'ఇటీవలే 40 వేల మంది ఫ్రెషర్స్ కి మా సంస్థ అవకాశం కల్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన వీరు జూన్ తర్వాత ఉద్యోగాల్లో చేరుతుంటారు. ఆ విధంగా ఎంపిక చేసిన వారిని కూడా కొనసాగిస్తాం. ముందుకు వెళ్తాం' అని సంస్థ మానవ వనరుల విభాగం హెడ్ మిలింద్ లకడా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News