WhatsApp: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్

WhatsApp to Allow More Users in Group Calls to Take on Google Duo Zoom
  • వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌లో ఇప్పటివరకు నలుగురికే ఛాన్స్‌
  • త్వరలోనే పదుల సంఖ్యలో కాల్స్‌ చేసుకునే అవకాశం
  • గూగుల్‌ డుయో, జూమ్‌ యాప్‌లకు పోటీ
  • బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్లు కనపడ్డాయన్న 'వాబీటాఇన్ఫో'
కరోనా సృష్టిస్తోన్న కలకలంతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గతంలోలా స్నేహితులతో గుంపులుగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే అవకాశం లేదు. పది మందితో కలిసి మాట్లాడే చాన్స్‌ ఇప్పట్లో కనపడట్లేదు. దీంతో తమ స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులతో మాట్లాడుకోవడానికి అందరూ మొబైల్‌ యాప్‌లను అధికంగా వాడేస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో అదిరిపోయే ఫీచర్లతో తమ యాప్‌లో అనేక మార్పులు చేసిన వాట్సప్‌ తాజాగా మరో ఫీచర్ ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇకపై వాట్సప్ గ్రూప్‌ కాల్‌లో చాలా మంది ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌లో కేవలం నలుగురు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

దీంతో చాలా మంది ఇతర యాప్‌లను వినియోగిస్తున్నారు. వాట్సప్‌ తమ గ్రూప్ కాల్‌ ఫీచర్‌లో పరిధిని పెంచుతూ నలుగురి కంటే ఎక్కువ మంది మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేలా మార్పులు చేసింది. వాట్సప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనపడిందని, త్వరలోనే యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుందని 'వాబీటాఇన్ఫో' సంస్థ పేర్కొంది.

ఇప్పటికే జూమ్, గూగుల్‌ డుయో వంటి యాప్‌లు పదులకొద్దీ యూజర్లు ఒకేసారి గ్రూప్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి ఫీచరునే తీసుకురావడానికి వాట్సప్‌ సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ వాట్సప్‌ యాప్‌లో అప్‌డేట్‌ కాలేదు.

అయితే, దీన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని  'వాబీటాఇన్ఫో' చెప్పింది. ఈ కొత్త ఫీచర్‌లో ఎంతమంది ఒకేసారి మాట్లాడుకోవచ్చన్న విషయంపై స్పష్టతరాలేదు. అయితే, వాట్సప్‌ కూడా పదుల సంఖ్యలో యూజర్లు గ్రూప్‌ కాల్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వచ్చు.
WhatsApp
Social Media
Social Distancing
Lockdown

More Telugu News