Card Board: కార్డ్ బోర్డుతో అత్యంత సులువుగా హాస్పిటల్ బెడ్ తయారీ... వీడియో ఇదిగో!
- అట్టపెట్టెల్లో ఉపయోగించే కార్డుబోర్డుతో ఆసుపత్రి బెడ్
- 200 కిలోల బరువు మోస్తుందంటున్న నిపుణులు
- తక్కువ బరువుండడంతో సులువుగా రవాణా చేసే అవకాశం
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రి పడకలకు కొరత ఏర్పడవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అలాంటి పరిస్థితే వస్తే తాము తయారుచేసే కార్డ్ బోర్డు బెడ్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని గుజరాత్ కు చెందిన ఆర్యన్ పేపర్ గ్రూప్ చెబుతోంది. ఈ సంస్థకు చెందిన నిపుణులు ఎంతో సులువుగా హాస్పిటల్ బెడ్ తయారుచేశారు. అందుకు వారు ఉపయోగించిందల్లా నాణ్యమైన, గట్టి కార్డ్ బోర్డు మాత్రమే.
మన ఇళ్లలో నిత్యం చూసే అట్టపెట్టెల్లో ఉపయోగించే దళసరి కార్డుబోర్డు పేపర్ ను ఈ బెడ్ తయారీలో వినియోగించారు. ఈ కార్డ్ బోర్డును ఓ క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా 200 కిలోల బరువు మోయగలిగే బెడ్ తయారుచేయవచ్చని ఆర్యన్ పేపర్ గ్రూప్ నిపుణులు చెప్పడమే కాదు, చేసి చూపించారు. ఇంతజేసీ దీని బరువు 10 కిలోలు మాత్రమే! దాంతో సులువుగా రవాణా చేయవచ్చు.
ఇది కార్డ్ బోర్డు అయినా, దీనికి ప్రత్యేకమైన రసాయనాలను పూయడం వల్ల వాటర్ ప్రూఫ్ గా మారుతుంది. దీనిపై నీరు పోసినా తడిసి మెత్తబడడం జరగదు. అంతేకాదు, దీని తయారీకి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందంతే. ఈ విపత్కర సమయంలో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు ప్రభుత్వాలకు ఎంతో ఖర్చు తగ్గిస్తాయనడంలో సందేహం లేదు.