Team India: ధోనీ సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారు?: హర్భజన్
- ఆడుతానంటే అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలి
- జట్టుకు ధోనీ అవసరం ఉన్నా... తీసుకోవాల్సిందే
- మెగా టోర్నీ జట్టులో హార్దిక్ పాండ్యా కూడా అవసరం
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఎంపిక చేయడం అంత కష్టమైన విషయమేమీ కాదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సెలక్షన్స్‌కు ధోనీ అందుబాటులో ఉంటే అతడిని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. గొప్ప ఆటగాళ్లు, గొప్ప నాయకుల్లో ఒకడైన ధోనీ అనుభవం ఈ మెగా టోర్నీలో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు.
గతేడాది వన్డే వరల్డ్ కప్ నుంచి ధోనీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌తో అతను తిరిగి టీమిండియాలోకి వస్తాడని అనుకుంటే ఆ లీగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై రోజుకో వార్త వస్తోంది. అతడిని భారత జట్టులోకి తీసుకుంటే ఏ ప్రాతిపాదికన ఎంపిక చేస్తారని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. అయితే, భజ్జీ మాత్రం ధోనీకి మద్దతు ఇచ్చాడు. ధోనీ, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ఫామ్ కొలమానం కాదన్నాడు.
‘ధోనీ సామర్థ్యాన్ని ఇప్పుడు ఎలా అంచనా వేస్తారు? అతని ఐపీఎల్ ఫామ్ చూస్తారా? లేక భారత అత్యుత్తమ నాయకులు, ఆటగాళ్లలో ఒకడని గౌరవం ఇచ్చి పరిగణనలోకి తీసుకుంటారా? భారత క్రికెట్‌కు అతను ఎంతో సేవ చేశాడు. పైగా అతను చాలా మంచి ఆటగాడు. అలాంటి వ్యక్తిని తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అడగకూడదు. జట్టుకు ధోనీ అవసరమున్నా, ఆడడానికి అతను సిద్ధమని చెప్పినా ఎంపిక చెయ్యాలి’ అని హర్భజన్ పేర్కొన్నాడు.
గాయం కారణంగా ఇటీవల జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం టీ20 వరల్డ్‌కప్ జట్టులో కచ్చితంగా ఉండాలని అన్నాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆడకపోయినా.. ఫిట్‌నెస్ సాధిస్తే పాండ్యాకు భారత జట్టులో చోటు ఖాయమే అని భజ్జీ తెలిపాడు. జట్టు సమతుల్యత కోసం పాండ్యా ఉండడం అవసరమని హర్భజన్ అన్నాడు.