Corona Virus: కరోనా హాట్‌స్పాట్‌గా ఢిల్లీ షాహీన్ బాగ్!
- సీఏఏ, ఎన్‌ఆర్సీ వ్యతిరేక ఆందోళనలకు కేంద్రంగా నిలిచిన ప్రాంతం
- వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు
- ఢిల్లీలో 60కి చేరిన హాట్‌స్పాట్ జోన్లు
పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు కేంద్ర స్థానంగా నిలిచిన ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతం ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు వంద రోజుల పాటు నిరసన కార్యక్రమాలతో ఈ ప్రాంతం అట్టుడికింది. కానీ, ఢిల్లీలో కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో అధికారులు దాన్ని హాట్‌స్పాట్ జాబితాలో చేర్చారు.
షాహీన్ బాగ్‌తో పాటు ఇంకొన్ని ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. దీంతో దేశ రాజధానిలో హాట్‌స్పాట్ జోన్ల సంఖ్య 60కి చేరింది. ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నేరుగా సరుకులు, మందులు పంపిస్తారు. అలాగే, ప్రతి ఇంటిని శానిటైజ్ చేసి.. డోర్ టూ డోర్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం వరకు ఢిల్లీలో ఆరు జిల్లాలను వైరస్ హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 38 మంది చనిపోగా.. గురువారం ఒక్కరోజే 62 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.