Sania Mirza: లాక్ డౌన్ రోజుల్లో గృహ హింస పెరగడంపై సానియా ఆందోళన
- ఆన్ లైన్ సదస్సు నిర్వహించిన 'ఇండియాటుడే' మీడియా సంస్థ
- మహిళా సమస్యలపై ఎలుగెత్తిన సానియా
- ఆలోచన ధోరణి మారాలని సూచన
దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, మహిళలపై గృహ హింస పెరుగుతోందంటూ వార్తలు రావడం పట్ల ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలపై అనేక వేదికలపై ఘాటుగా స్పందించే సానియా ఈ అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. 'ఇండియాటుడే' మీడియా సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో పాల్గొన్న సానియా మాట్లాడుతూ, మహిళలను, పురుషులను సమానంగా చూడాలని పిలుపునిచ్చారు.
"లాక్ డౌన్ సందర్భంగా మహిళలపై దాడులు, గృహ హింస పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు నా దృష్టికీ వచ్చాయి. దీన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను. గృహ హింస అనేది ఒక అసంబద్ధమైన విషయం. లాక్ డౌన్ రోజుల్లో పురుషులు, మహిళలు అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనా ధోరణి మారితే చాలు. అయితే తమకు లభించాల్సిన గౌరవం కోసం శాసించి, సాధించాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది" అని అభిప్రాయపడ్డారు.