Sugarcane Workers: మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం... స్వస్థలాలకు వెళ్లేందుకు లక్ష మంది వలస కార్మికులకు అనుమతి!

Maha government decides to send sugarcane workers home

  • లక్ష మంది చెరుకు కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
  • చక్కెర కర్మాగారాల్లో ఆశ్రయం పొందుతున్న కూలీలు
  • కష్టసాధ్యంగా మారిన వసతి సదుపాయాల కల్పన

కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ తో అందరికంటే ఎక్కువగా ఇబ్బందిపడుతున్నది వలస కార్మికులే. లాక్ డౌన్ ప్రకటించడంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు కాలినడకన ప్రయాణాలు చేస్తున్న వైనం అందరినీ కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో, వలస కార్మికుల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మంది వ్యవసాయ కూలీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెరుకు పొలాల్లో, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోయారు. మొత్తం 1.31 లక్షల మంది కార్మికులకు 38 చక్కెర కర్మాగారాల్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. అయితే, లక్షల సంఖ్యలో ఉన్న వీరందరినీ నియంత్రించడం, ఆహార, వసతి సౌకర్యాలు కల్పించడం కష్టసాధ్యంగా మారింది. దానికితోడు, వ్యవసాయకూలీల్లో నానాటికీ పెరుగుతున్న ఆగ్రహజ్వాలలు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారాయి.

ఈ నేపథ్యంలో సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే ఓ ప్రకటన చేశారు. "చెరుకు కూలీ సోదరులకు శుభవార్త! మీరు మీ గ్రామాలకు వెళ్లిపోవచ్చు. దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. మీ స్వస్థలాలకు వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోండి. మీ ఆరోగ్యాలతో పాటు మీ గ్రామ ప్రజల ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ గ్రామాలకు వెళ్లిన తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావొద్దు" అంటూ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News