HD Kumaraswamy: పెళ్లికి ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం: కుమారుడి పెళ్లిపై మాజీ సీఎం కుమారస్వామి
- పెళ్లి చేసి తప్పు చేయలేదు
- మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు
- పరిస్థితులు కొలిక్కి వచ్చాక అందరితో కలిసి భోజనం చేస్తా
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న వేళ కుమారుడి పెళ్లి చేసి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విమర్శల పాలయ్యారు. పెళ్లి సందర్భంగా సామాజిక దూరం పాటించని మాజీ ప్రధాని దేవెగౌడను అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దేవెగౌడ మనవడు, కుమారస్వామి కుమారుడైన నటుడు నిఖిల్.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతి వివాహం నిన్న రాంనగర్ కేతగానహళ్లి ఫాం హౌస్‌లో జరిగింది. దేవెగౌడ కుటుంబ సభ్యులు, వధువు తల్లిదండ్రులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే సామాజిక దూరం నిబంధనను పక్కన పెట్టి పెళ్లి చేయడంపై వస్తున్న విమర్శలపై కుమారస్వామి స్పందించారు. కుమారుడి పెళ్లిని సమర్థించుకున్నారు. పెళ్లికి ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నిఖిల్ పెళ్లి చేసి తప్పు చేయలేదన్నారు. పెళ్లిలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు. తన తండ్రిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు అర్థరహితమైనవని కొట్టిపడేశారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులు ముగిసిన తర్వాత మీతో కలిసి భోజనం చేస్తానంటూ కార్యకర్తలు, శ్రేయోభిలాషులను ఉద్దేశించి కుమారస్వామి ట్వీట్ చేశారు.